Adulterated Chilli Powder : విపరీతమైన జనాభా పెరుగుదల అభివృద్ధికి ఏ విధంగా ఆటంకంగా మారుతుందో అలాగే మనుషుల ఆరోగ్యాలకు కూడా అంతే ప్రమాదకరంగా మారుతోందన్న విషయం మీకు తెలుసా.. ఏంటీ నమ్మాలనిపించడం లేదా..? ఇదే నిజం.. ఎందుకంటే జనాభా పెరుగుదల వలన పరిమితంగా ఉన్న రీసోర్సెస్ అందరికీ సమానంగా ఇవ్వాలంటే సాధ్యపడదు. డిమాండ్‌కు తగిన సప్లయ్ ఉండదు.
ఈ లాజిక్ తెలుసుకున్న కొందరు అక్రమార్కులు వసువులను, మనం తినే ఆహార పదార్థాలను కల్తీ చేయడమే వ్యాపారంగా ఎంచుకున్నారు. తాగే నీళ్ల నుంచి పొద్దున తోముకునే పళ్ల పొడి వరకు అన్ని కల్తీ అవుతున్నాయి. ఇక వంటింట్లో వాడే ఉప్పులు, పప్పులు, కారం, నూనె అన్నీ కల్తీ మయమే.. చూసేందుకు మాత్రం ఒరిజినల్ లాగే కనిపించినా అసలు ఏదో నకిలీ ఏదో గుర్తించడం చాలా కష్టం. కానీ, మన ఇంట్లో వాడే కారంపొడి స్వచ్ఛమైనదో కాదో తెలుసుకోవడం చాలా సింపుల్..
కల్తీ కారాన్ని గుర్తించడం ఎలా?
మన ఇంట్లో వాడే ఆహార పదార్థాలు చాలా వరకు కల్తీ అవుతున్నట్టు గుర్తించిన FSSAI కొన్ని రకాల వీడియోలను షేర్ చేసింది. అందులో వివిధ రకాల కల్తీ ఉత్పత్తులను ఏ విధంగా కనుక్కోవాలో క్లుప్తంగా వివరించారు. వీరు చెప్పిన విధంగా చేయడం వలన కల్తీ వస్తువులకు దూరంగా ఉండవచ్చు. దీంతో మన ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుందని పేర్కొన్నారు. మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలని సూచించారు. ఇటీవల మనం వాడే కారం పొడిలో ఇటుక పొడి, ఎర్రమట్టి కలుస్తుందని ఫుడ్ సేప్టీ అధికారులు తెలిపారు. దీనిని ఎలా కనుక్కోవాలో కూడా వివరించారు.
మనం ఇంట్లో వాడే కారం పొడిని కొద్దిగా తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలుపుకోవాలి. బాగా కలిపాక ఆ నీటి మొత్తాన్ని మీ అరచేతిలో పోసుకొండి. అందులో ఏమైనా మీ చేతిలో ఇసుక లాగా నిలిచిందంటే.. అది తప్పకుండా కల్తీ అని తెలిపారు. ఏమీ లేకుండా మొత్తం నీళ్లు కారిపోతే అది అసలైనదని తెలిపారు. అంతేకాకుండా సబ్బు లాగా నురగ వస్తే ఆ కారంపొడిని ఏదైనా సబ్బు మిశ్రమంతో తయారు చేసి ఉంటారని అధికారులు వెల్లడించారు. ఈ రకంగా కల్తీ వస్తువులను గుర్తించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఫుడ్ స్టేఫ్టీ అధికారులు సూచించారు.