Maida Adulteration : మీరు వాడే మైదా పిండి అసలైనదేనా? కల్తీ జరిగిందా? ఎలా తెలుసుకోవడం అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. మైదా పిండి కల్తీ అయిందని గుర్తించడం చాలా సులభం కూడా.. మైదా పిండితో వంటలు చేసే సమయంలో ఇలా టెస్టు చేయడం ద్వారా అది కల్తీ అయిందో లేదో ఈజీగా కనిపెట్టవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కెట్లో నిత్యవసరాలకు కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌కు సరిపడా సప్లయ్ ఉండటం లేదు. ఈ విషయం తెలుసుకున్న కొందరు అక్రమార్కులు అన్ని వస్తువులను కల్తీ చేసి మార్కెట్లో కొంచెం తక్కువకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇవే అసలైన వస్తువులు అని నమ్మి కొనుగోలు చేసిన వారు మాత్రం అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

ఇలా రెండు రకాలుగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు మోసపోతున్నారు. ఇటీవల కాలంలో వంటింటి వస్తువులు, పదార్థాలు చాలా మేరకు కల్తీ అవుతున్నట్టు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. మైదా, గోధుమ, వరి పిండి వంటివి ఎలా కల్తీ అవుతున్నాయో వివరించే ప్రయత్నం చేసింది.
మైదా పిండిని కల్తీ చేసేందుకు కొందరు అక్రమార్కులు అందులో బోరిక్ యాసిడ్‌ను కలుపుతున్నట్టు గుర్తించారు. కల్తీని చేసిన మైదాను గుర్తించాలంటే చాలా సింపుల్ ప్రాసెస్. ముందు ఒక టెస్ట్ ట్యూబ్‌ను తీసుకోవాలి. అందులో ఒక గ్రాము మైదా వేసుకోవాలి. ఆ తర్వాత టెస్ట్ ట్యూబులో 5 మిల్లీ లీటర్లు నీళ్ళు పోసి, ఆ ట్యూబ్‌ను నెమ్మదిగా షేక్ చేయాలి. అందులో కొంచెం కాన్సెంట్రేటెడ్ హెచ్సీఎల్ చుక్కలు వేయాలి. చివరగా అందులో ఒక పసుపు కొమ్ము ముక్కను వేయాలి.
ఆ ట్యూబ్‌లోని మైదా పిండిలో ఎటువంటి మార్పు లేకుండా ఉంటే అది నిజమైనది. ఒకవేళ ఎరుపు రంగులోకి మారినట్టు అయితే అది కల్తీగా తెలుస్తుంది. ఈ విధంగా కల్తీ వస్తువులను ముందుగానే గుర్తించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చును. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..