Natu Kodi Pulusu Recipe : నాటుకోడి పులుసు.. ఈ పేరు వినగానే మాంస ప్రియులు ఎవరికైనా నోరూరిపోతుంది. అంతగా ఇష్టపడతారు ఈ నాటి కోడి పులుసు.. అంత టేస్టు ఉంటుంది మరి.. అందుకే పండుగలు వచ్చినప్పుడు ఈ నాటు కోడి పులుసును ఎక్కువగా చేస్తుంటారు. అందరితో కలిసి ఆనందంగా ఆరగిస్తుంటారు. నాటు కోడి పులుసును ఎంతో టేస్టీగా తయారుచేయడం కూడా తెలిసి ఉండాలి. లేదంటే.. అనుకున్నంతగా కర్రీ కుదరదు. నాటు కోడి పులుసును విలేజ్ స్టయిల్లో తయారు చేసుకుంటే టేస్టు అదిరిపోతుంది.
ఇంతకీ నాటు కోడి పులుసును ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.. అందుకు కావాల్సిన పదార్థాలు.. చికెన్ 2 కిలోలు తెచ్చుకోవాలి. ఉల్లిపాయలను పది వరకు చిన్నముక్కులుగా కట్ చేసుకోవాలి. ఐదు పచ్చి మిరపకాయలను నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే, మీడియం సైజులో కాల్చిన ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయాలి. టీ స్పూన్ పసుపుతో పాటు మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లులి పేస్టును కూడా చేర్చాలి. నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేయాలి. టమాటాలను పెద్దగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర చిన్నది, యాలకులు, సాజీరతో పాటు లవంగాలు, దాల్చిన చెక్క, గరం మసాల పోడిని బాగా కలపాలి. చివరిగా తగినంత ఉప్పుతో పాటు 250 గ్రాముల నూనె కూడా రెడీ చేసుకోవాలి.
తయారీ విధానం ఇలా :
ముందుగా.. స్టవ్ మీద కళాయి పెట్టాలి. అందులో నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించాలి. ఆ తర్వాత టమాటాలను వేసి మెత్తగా అయ్యేలా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేయాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను కూడా వేయాలి. ఆపై కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ మగ్గేంతవరకు బాగా వేయించుకోవాలి. చివరిగా ఎండుకొబ్బరిని దంచాలి.
గరం మసాలా పొడిని మగ్గుతున్న చికెన్‌లో వేసి కలుపుకోవాలి. ఐదు నిమిషాల వరకు ఉడికించిన తర్వాత చికెన్‌లో నీళ్లు కలపాలి. నాటు కోడి చికెన్ 20 నిమిషాలు వరకు ఉడకించిన తర్వాత గ్రేవీ వచ్చేంతవరకు అలానే ఉంచాలి. ఇప్పుడు దానిపై కొత్తిమీర జల్లాలి. ఆపై నాటు కోడి పులుసు కర్రీపై నూనె తేలేంతవరకు ఉడికించాలి. ఇంకేముంది.. నాటుకోడి పులుసు రెడీ అయింది.. ఇక నాటుకోడి పులుసును వేడివేడి అన్నంలో కానీ, ఏదైరా రోటీలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. మీరూ కూడా ఈ విలేజ్ స్టయిల్ నాటు కోడి పులుసును ఓసారి ట్రై చేయండి..