Telangana Style Chepala Pulusu : తెలంగాణ స్టైల్ చేపల పులుసు అన్నం తోటే కాదు ఇడ్లీ దోశ వడ ఉప్మా గారెలు వేటితోటైనా తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది పులుసు. ఈ చేపల పులుసు పాడవకుండా మూడు రోజులు ఉంటుంది. స్పైసి స్పైసి చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. చేపల పులుసు అనగానే మాంసాహారాలకు నోరూరిపోతుంది. అందులోనూ చల్లారిన చేపల పులుసు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చేపల పులుసును వండిన మరుసటి రోజున అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో తెలంగాణ స్టయిల్ చేపల పులుసును ఓసారి ట్రై చేయండి..
కావలసిన పదార్థాలు.. చేపలు1 కేజీ, చింతపండు50- 60 గ్రాములు, ఉప్పు, కారం, నూనె, ఉల్లిపాయ 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2, ధనియాలు 2 స్పూన్లు, జిలకర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 1 ఇంచు, లవంగాలు 6, యాలకులు 4, మిరియాలు 1 టీ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు 1/3కప్పు, మెంతులు 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్
తయారీ విధానం.. ముందుగా ఒక బౌల్లో చింతపండు వేడి నీళ్లలో నానబెట్టుకోవాలి. చేప ముక్కల్లో ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలను ఒక టీ స్పూన్ పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు ఉల్లిపాయలను లోపలిదాకా మగ్గేవరకు కాల్చుకోవాలి ఇప్పుడు పైన పొట్టు తీసి మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేయాలి.
మసాలా కోసం.. ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, రెండు స్పూన్ల ధనియాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, ఎండు కొబ్బరి ముక్క లు లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చే వరకు వేగిన తర్వాత రెండు చిటికెల్లా వాము వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత మెత్తటి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు చిక్కటి చింతపండు గుజ్జులో ఉల్లిపాయ పేస్టు, రెండున్నర స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని పావు కప్పు నూనె పోసి నూనె వేడైన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కలిపి ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించుకోవాలి
అలా చేయడం వల్ల రెండు మూడు రోజులు పులుసు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఒక లీటర్ వేడి నీళ్లు పులుసులో పోయాలి. ఇప్పుడు మసాలా పొడి వేసి తర్వాత ఐ ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాలు పులుసును బాగా మరగనివ్వాలి. అందులో పసుపు పట్టించిన చేప ముక్కలు పులుసులో వేసి ముక్క విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. చేపల పులుసులో నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి
సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కళాయిని నెమ్మదిగా కదపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చెయ్యండి. చేపల పులుసు చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరుసటి రోజు చేపల పులుసును తినాలి అనుకుని వారు పులుసును పలుచగా చేసుకోండి. పులుసు చల్లారే కొద్ది చిక్కబడుతుంది. ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ..
Read Also : Nellore Chepala Pulusu : నోరూరించే నెల్లూరు చేపల పులుసు…ఎలా చేయాలి?